మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైందో, లేదో తెలుసుకోవడమెలా?


మీరు ఫేస్ బుక్ ఖాతాను వినియోగిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.. తాజాగా 5 కోట్ల (50 మిలియన్లు) మంది ఫేస్ బుక్ ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. సోషల్ మీడియాలో టాప్ నెట్ వర్క్ గా కొనసాగుతున్న ఫేస్ బుక్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. కేంబ్రిడ్జ్ ఎనలిటికా గత మార్చిలోనే ఫేస్ బుక్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవుతున్నాయని వెల్లడించింది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా హ్యాకింగ్ గురించి ఒక పోస్టులో ధ్రువీకరించారు. అయితే హ్యాకింగ్ కు గురవుతున్న ఖాతాలు మిస్ యూజ్ అవుతున్నాయో, లేదో తెలియదని ఆయన చెప్పారు. ఈ విషయంలో కంపెనీ ఇంకా కృషి చేస్తోందని తెలిపారు.

ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గే ఫేస్ బుక్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవుతున్నాయని ధ్రువీకరించారు కాబట్టి.. మన డేటా ఉల్లంఘనలకు గురవుతోందని తెలుస్తోంది. మన ఖాతాలానే చాలామంది ఖాతాలు హ్యాకింగ్ గురయ్యాయి. అంతేకాకుండా మన డేటా హ్యాకర్ల చేతికి చేరింది. 5 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాలు ఎలా హ్యాకింగ్ కు గురయ్యాయంటే..

ఫేస్ బుక్ తన "వ్యూ యాజ్" ఫీచర్ కారణంగా హ్యాకింగ్ జరిగిందని వెల్లడించింది. ఈ ఫీచర్ ఇతర వ్యక్తులకు వారి ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో చూడటానికి అనుమతిస్తుంది. హ్యాకర్లు ఈ ఫీచర్ లోని కోడ్ ను లక్ష్యంగా చేసుకుని "యాక్సెస్ టోకెన్స్" ను దొంగిలించారు. మరో మాటలో చెప్పాలంటే, వారు ప్రజల ఫేస్ బుక్ ఖాతాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. 

ఫేస్ బుక్ ఈ వారంలోనే ఖాతాలు హ్యాకింగ్ కు గురవుతున్నాయని కనుగొంది. కాబట్టి హ్యాక్ సరిగ్గా ఎప్పుడు జరిగిందో, లేదా హ్యాకర్లు మీ డేటాను ఎంతకాలం నుంచి కలిగి ఉన్నారో తెలియడం లేదు. అదేవిధంగా హ్యాకింగ్ వెనుక ఉన్న సంస్థ లేదా వ్యక్తి లేదా గ్రూప్ ఎవరో తెలియదు. ఇప్పటికే ఫేస్ బుక్ అమెరికా విచారణ సంస్థ.. ఫెడరల్ బ్యూరో్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఫిర్యాదు చేసింది. విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు హ్యాకింగ్ వెనుక ఉన్నది ఎవరో తెలియరాలేదు. 
మొత్తం 200 కోట్ల ఫేస్ బుక్ వినియోగదారుల్లో 90 మిలియన్ల మంది (తొమ్మిది కోట్ల మంది) ఖాతాలు హ్యాకింగ్ వల్ల ప్రభావితమయ్యాయి. హ్యాకింగ్ బారిన పడ్డ 50 మిలియన్ల మంది ఖాతాల్లో 40 మిలియన్ల మంది ఖాతాలు రీబూట్ చేయబడ్డాయి. ఎందుకంటే వీరు కూడా వ్యూ యాజ్ ఫీచర్ ను ఉపయోగించారు. 

ఇప్పుడు ఫేస్ బుక్ సమస్యను పరిష్కరించింది. హ్యాకింగ్ కు కారణమైన బగ్ ను తొలగించామని పేర్కొంది. ప్రస్తుతం ఫేస్ బుక్ ఖాతాలు సురక్షితం అని కంపెనీ వెల్లడించింది. మన ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురయిందని తెలుసుకోవాలంటే.. మన ఖాతా హ్యాకింగ్ కు గురయితే ఫేస్ బుక్ మన ఖాతా హ్యాకింగ్ కు గురయిందని సమాచారం పంపుతుంది. ఇది నోటిఫికేషన్ రూపంలో మీ ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ పైన కనిపిస్తుంది. 50 మిలియన్ల మంది ఖాతాలు హ్యాకింగ్ కు గురవడం వల్ల వారు పంపిన సందేశాలు, చిత్రాలు, వీడియోలు, పోస్టులు, చాట్లు, లైకులు ఇలా ప్రతిదీ హ్యాకర్ల చేతికి చిక్కినట్టే. దీంతో చాలామంది ప్రమాదం బారినపడ్డట్టే. 
అంతేకాకుండా వైర్డ్ నివేదిక ప్రకారం.. మీరు మీ ఫేస్ బుక్ యూజర్ నేమ్, పాస్ వర్డ్  ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేసే ఏదైనా ఖాతా ప్రభావితం కావచ్చు. ఉదాహరణకు, మీరు మీ Facebook ID తో Zomato లేదా Instagram ఉపయోగిస్తే, ఆ ఖాతాలు కూడా హ్యాకింగ్ కు గురై ఉండొచ్చు.
ఇక చివరగా పేస్ బుక్ చెబుతున్నదేమిటంటే.. మనం ఫేస్ బుక్ ను రకరకాల పరికరాల్లో (ఫోన్, ల్యాప్ ట్యాప్, సిస్టమ్, ట్యాబ్) వాడుతుంటాం. అన్ని పరికరాల నుంచి పేస్ బుక్ ను లాగ్ అవుట్ చేసి మళ్లీ లాగిన్ అవ్వాలని ఫేస్ బుక్ సూచించింది. అయితే పాస్ వర్డ్ ను మార్చుకోవాలని సూచించలేదు. మనం పాస్ వర్డ్ ను కూడా మార్చుకున్నట్టయితే మన ఫేస్ బుక్ ఖాతా మరింత సురక్షితంగా ఉంటుంది.

Comments