సిమ్‌ కార్డు నుంచి ఆధార్‌ను డీలింక్‌ చేసుకోవచ్చా?

మొబైల్‌ ఫోన్లకు సిమ్‌ కార్డులు తీసుకోవాలంటే ఆధార్‌ కార్డు సమర్పించడం తప్పనిసరి కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డు అడగొద్దంటూ అన్ని టెలికాం ప్రొవైడర్లను యూనిక్‌ ఐడింటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) కోరింది. ఇక నుంచి కొత్త సిమ్‌ కార్డుల కోసం లేదా రీవెరిఫికేషన్‌ కోసం ఆధార్‌ అవసరం లేదని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశంలో భాగంగా యూఐడీఏఐ ఈ ^è ర్యలు చేపట్టింది. 

ఈ నేపథ్యంలో కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియలో భాగంగా.. ఆధార్‌ కాకుండా పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, రేషన్‌ కార్డ్, ఓటర్‌ ఐడీ కార్డ్, బ్యాంక్‌ పాస్‌ బుక్, కరెంట్‌ బిల్లుల్లో ఏదో ఒకటి సమర్పించి సిమ్‌ కార్డు తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు తమ సిమ్‌ కార్డు కనెక్షన్‌ నుంచి ఆధార్‌ను డీలింక్‌ చేసుకోవాలని అనుకున్నా పైవాటిలో ఏదొకటి సమర్పించాల్సి ఉంటుంది. 

ఈ మేరకు ఇప్పటికే అన్ని టెలికాం ప్రొవైడర్లకు ఈ దిశగా యూఐడీఏఐ సంకేతాలు ఇచ్చింది. ఆధార్‌ను తమ సిమ్‌ కార్డుల నుంచి డీలింక్‌ చేసుకోవాలనుకునేవారిని ఇబ్బంది పెట్టొద్దని కోరింది. ఆధార్‌ను సిమ్‌ కనెక్షన్‌ నుంచి డీయాక్టివేట్‌ చేసుకోవాలనుకునేవారు కోరాక.. నాటి నుంచి ఆరు నెలల్లోపు వినియోగదారుడి చిరునామాను సూచించే ధ్రువీకరణ తీసుకోవాలని సూచించింది. ఆధార్‌ డీయాక్టివేట్‌ కోరాక ఆరునెలల్లోపు చిరునామాను ధ్రువీకరించే సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే మొబైల్‌ నంబర్‌ డీయాక్టివేట్‌ అవుతుంది. సిమ్‌ కనెక్షన్‌ నుంచి ఆధార్‌ను డీయాక్టివేట్‌ చేయించుకోవడం కోసం వచ్చేవారికి వెంటనే సేవలు అందించాలని యూఐడీఏఐ కోరింది.

Comments